వందేభారత్ రైలుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందేభారత్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కుర్వాయి స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. భోపాల్‌లోని రాణికమలాపాటి స్టేషన్ నుంచి బయలుదేరిన వందేభారత్ రైలు.. కుర్వాయి స్టేషన్ వద్దకు చేరుకోగానే సీ-14 కోచ్ వద్ద మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌ను అప్రమత్తం చేసి రైలును నిలిపివేయించారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ ప్రకటించింది. తొలుత బ్యాటరీ బాక్సులో మంటలు చెలరేగాయని, ఫైర్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి వాటిని ఆర్పివేశారని పేర్కొంది. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత రైలు బయలుదేరుతుందని వెల్లడించింది.
రాణికమలాపాటి స్టేషన్ నుంచి రైలు నెంబరు 20171 భోపాల్- హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 5.40 గంటలకు బయలుదేరింది. బినా స్టేషన్‌కు ముందు కుర్వాయ్ కేథోర వద్ద ఉదయం 7.10 గంటలకు సీ-14 కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఆ సమయానికి కోచ్‌లో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో రైలును కుర్వాయ్ వద్ద నిలపివేసి ప్రయాణికులను కిందకు దింపేశారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ రైలులో ప్రయాణిస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘తాను ఉన్న సీ-14 కోచ్ కింద భాగం నుంచి కాలుతున్న శబ్దం వచ్చింది.. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.. రైలు ఆపిన తర్వాత బ్యాటరీ బాక్సులో నుంచి మంటలు రావడం చూశాను’ అని చెప్పారు. కాగా, భోపాల్- న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ వందే భారత్ రైలును ఏప్రిల్ 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో తొలి వందే భారత్ రైలు ఇదే. గత నెల 19న ఈ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.