రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి అందరూ కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. భవిష్యత్‌కు గ్యారంటీ బస్సుయాత్రలో భాగంగా సోంపేటలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ అధ్యక్షతన సోమవారం రాత్రి సభ జరిగింది. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు రక్షణ ఉండేదని, వారు స్వేచ్ఛగా తిరిగేవారని అన్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఈ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఎక్కడ హత్య జరుగుతుందో, ఎక్కడ అత్యాచారం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక మధ్యపానం నిషేధం అమలు చేస్తానన్న జగన్.. ఇప్పుడు మద్యాంధ్రను చేశారని ఆరోపించారు.