బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో ప్రణాళికలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. గురువారం ఉదయం నడ్డాతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్న పరిణామాలు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా జేపీ నడ్డా దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, మురళీధరన్‌తో సైతం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సీఎం వైఎస్ జగన్ వ్యవహారంపై చర్చలు సాగించినట్లు సమాచారం. మరోవైపు గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడకు బయల్దేరారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.