ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు రుతుపవనాలు కూడా స్పీడ్ అందుకున్నాయి. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలోనే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు రుతపవన ద్రోణి తూర్పు భాగం కటక్ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు ఎక్కువ చోట్ల.. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి, రెండు చోట్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
గురువారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గురవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరులో అతి భారీ వర్షం కురుస్తుందంటున్నారు. అనకాపల్లి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీగా వానలు పడతాయంటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు 7.8 సెంటీమీటర్లు.. అలాగే అదే జిల్లా పాడేరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 6, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 5.8, పాలకొండలో 5.4, ఏలూరు జిల్లా కుక్కనూరుల 5.3, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్ కోటలో 4.9, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 4.8, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి,కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా వానలు మరింత ఊపందుకున్నాయి.