హీరో సూర్య జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కట్టుబడివారి పాలెంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకోగా.. విద్యార్థుల మరణంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సరాపుపేట గ్రామీణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా గుర్తించారు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్లు నిర్ధారించారు. వెంకటేశ్ది మోపూరివారిపాలెం కాగా.. పోలూరి సాయి బాపట్ల జిల్లా పంగలూకు చెందినవాసిగా గుర్తించారు. హీరో సూర్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయనపై ఉన్న అభిమానంతో బర్త్ డే విషెస్ చెబుతూ వీరిద్దరూ తన స్నేహితులతో కలిసి నర్సరావుపేట టౌన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఫ్లెక్సీలు కడుతుండగా ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ పక్కన ఉన్న కరెంట్ వైర్లకు తగిలింది. దీంతో వీరిద్దరికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం నర్సరావుపేటలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్లు గుర్తించారు. వీరి మరణంతో కాలేజీ విద్యార్థులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.