కోనసీమ జిల్లాలో గత కొంతకాలంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత విబేధాలు నెలకొన్నాయి. రామచంద్రపురం నియోజవర్గ వైసీపీ టికెట్‌పై ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. ఆ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని సుభాష్ చంద్రబోస్ కోరుతుండగా.. తాను పోటీ చేస్తానంటూ మంత్రి వేణు చెబుతున్నారు. దీంతో ఇద్దరి పోటాపోటీ ప్రకటనలతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికైనా సిద్దమని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో వేణు పోటీలో ఉంటే తాను మద్దతిచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. మా కుటుంబం నుంచే ఒకరు పోటీ చేయాలని క్యాడర్ కోరుతున్నారని, తనకు క్యాడర్ ముఖ్యమని స్పష్టం చేశారు. తాను క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్దం లేనని, ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతామన్నారు. వేణు ఆత్మీయ సమ్మేళనానికి తనకు ఆహ్వనం అందలేదని, దీనిపై సమయం వచ్చిప్పుడు క్యాడర్ సమాధానం చెబుతారని పిల్లి వ్యాఖ్యానించారు.
వేణును వైసీపీ అధిష్టానం సమర్థిస్తే పార్టీలో ఉండనని, పార్టీకి నష్టమైనా కార్యకర్తల కోసం తప్పడం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. త్వరలోనే ఆయన పార్టీని వీడుతారా? అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల మంత్రి వేణు, పిల్లిని అమరావతికి సజ్జల పిలిపించి వీరిద్దరితో మాట్లాడారు. టికెట్ విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారని, ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకోవద్దని సూచించారు. తన కుమారుడికే రామచంద్రపురం టికెట్ జగన్ కేటాయించేలా చూడాలని సజ్జలకు పిల్లి చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే మంత్రి వేణు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల పిల్లి వర్గం ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయగా.. దానికి పోటీగా వేణు వర్గం ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తోంది. ఇద్దరూ పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బలప్రద్శనకు దిగుతున్నారు. తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే సజ్జల మాట్లాడిన తర్వాత కూడా పిల్లి వెనక్కి తగ్గడం లేదని అర్థమవుతుంది. ఈ నెల 26న అమలాపురంలో జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేణు, పిల్లితో మాట్లాడే అవకాశముంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేలా ప్రయత్నాలు చేయనున్నారు. మరి రామచంద్రపురం టికెట్ విషయంలో వైసీపీ స్పష్టత ఇస్తుందా? ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదుర్చుతుందా? అనేది చూడాలి.