పిల్లలకు మొదటి పుట్టిన రోజు అంటే ఏ తల్లిదండ్రులైనా చాలా సంతోషంలో ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పిలిచి ఘనంగా బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కేకులు, ఫొటోలు, భోజనాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారి ఆ రోజు మొదటి బర్త్డే జరుపుకుంటోందని విమానయాన సిబ్బంది తెలుసుకున్నారు. దీంతో ఆ చిన్నారికి విమానంలోనే వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
తన మొదటి పుట్టిన రోజున విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి ఇండిగో విమానయాన సంస్థ సర్ప్రైజ్ ఇచ్చింది. విమానంలోనే ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్ ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా.. అది వైరల్గా మారింది. ఈ సంఘటన కొచ్చికి వెళ్తున్న ఇండిగో విమానంలో జరిగింది. జోయెల్ లాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కొచ్చికి వెళ్తున్నాడు. అందులో తన ఏడాది వయసు ఉన్న కుమార్తె దుర్గనాథ్ కూడా ఉంది. అయితే దుర్గనాథ్ పుట్టి.. జూన్ 22 కి సరిగ్గా ఏడాది అవుతుండటంతో ఈ విషయం ఇండిగో విమానంలో ఉన్న సిబ్బందికి తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన విమానం కెప్టెన్.. ప్రయాణికులకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఒక చిన్నారి.. మొదటి పుట్టిన రోజు జరుపుకుంటోందని చెప్పారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది అందరూ చప్పట్లతో దుర్గనాథ్కు బర్త్డే విషెస్ తెలియజేశారు.
విమానం కొచ్చి ఎయిర్పోర్టులో దిగిన వెంటనే పాపతో ఇండిగో సిబ్బంది కేక్ కట్ చేయించారు. అక్కడ కూడా అందరూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను జోయల్ లాల్.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన కుమార్తెకు మొదటి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించిన ఇండిగో విమానయాన సంస్థకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు అభినందనల వెల్లువ కురిపించారు. చిన్నారికి ఇండిగో సిబ్బంది ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని ప్రశంసలు తెలిపారు. ఇటీవలి కాలంలో చాలా ఘటనలతో వార్తల్లో నిలిచి విమర్శల పాలైన ఇండిగో ఎయిర్లైన్స్.. తాజాగా చిన్నారి మొదటి బర్త్ డే నిర్వహించి మంచి పని చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.