మనం రోడ్ల మీద వాహనాల్లో వెళ్లేటపుడు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. లేకపోతే ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కాల్సిందే. లేకపోతే వారి కెమెరాలైనా మన వాహనం నంబరు పట్టుకుని చలాన్ విధిస్తూ ఉంటాయి. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్ కట్టినపుడు తప్పనిసరిగా ట్రాఫిక్ సిబ్బంది రశీదు ఇస్తారు. అలా అయితేనే అవి ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్తాయి. ఇక కొంతమంది అవినీతిపరులైన ట్రాఫిక్ సిబ్బంది.. డైరెక్ట్‌గా డబ్బులు తీసుకుని రశీదులు ఇవ్వకుండా అడిగితే భయపెట్టే వారు కూడా ఉంటారు. ఇలాంటి సంఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ విదేశీయుడి వద్ద రశీదు లేకుండా డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఢిల్లీ ట్రాఫిక్ విభాగానికి చెందిన మహేశ్ చంద్ అనే పోలీసు.. ఓ కొరియా దేశానికి చెందిన వ్యక్తి నుంచి నడి రోడ్డుపై డబ్బులు తీసుకుంటూ కారులో ఉన్న కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై వెళ్తున్న కొరియా దేశస్థుడి కారును మహేశ్ చంద్ ఆపాడు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని.. అందుకు ఫైన్ కట్టాలంటూ డిమాండ్ చేశాడు. అయితే తొలుత కొరియన్ పర్యాటకుడు రూ. 500 ఇవ్వబోయాడు. దీంతో రూ. 5 వేలు ఇవ్వాలని మహేశ్ చంద్ డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక ఆ విదేశీయుడు రూ. 5 వేలు చెల్లించాడు. అయితే దానికి సంబంధించి ఎలాంటి రశీదు ఇవ్వకపోవడమే తాజా విమర్శలకు కారణమైంది.
అయితే ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే చర్యలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ సర్కార్.. మహేశ్ చంద్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. తీవ్ర విమర్శలకు దారి తీసిన ఈ ఘటనపై మహేశ్ చంద్ స్పందించారు. తాను డబ్బులు తీసుకుని రశీదు ఇచ్చే లోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయాడంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వీడియో చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ విదేశీయుడు మహేశ్ చంద్‌కు ధన్యవాదాలు చెప్పడం, అనంతరం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది.