ఉద్వాసనకు గురైన రాజస్థాన్ మాజీ మంత్రి రాజేంద్ర గుఢా.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తానే గనుక లేకపోయింటే.. అశోక్ గెహ్లాట్ జైలుకు వెళ్లేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రక్షించాడనే కృతజ్ఞతైనా చూపలేదని, కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలపై రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం నిరసనలు తెలుపుతుండగా.. సొంత పార్టీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. మణిపూర్ ఘటనలపై మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. రాజస్థాన్‌లో జరుగుతున్న దారుణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజేంద్ర గుధ అన్న విషయం తెలిసిందే.
ఝంఝున్‌వాలా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్ నివాసంపై ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడిచేసినప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓ ‘రెడ్ డైరీ’ని అక్కడ నుంచి తప్పించాను’ అని చెప్పారు. ముఖ్యమంత్రి ఫోన్ చేసి.. ఆ డైరీని ఎలాగైనా వెనక్కి తీసుకోవాలని చెప్పారని తెలిపారు. ‘డైరీని తగులబెట్టారా? అని ముఖ్యమంత్రి తనను పదే పదే అడిగారు.. అందులో ఎటువంటి నేరారోపణ లేకుంటే సీఎం అలా ఎందుకు చేయమంటారు’ అని ఆయన పేర్కొన్నారు.
రాజీనామా చేయమని ఆదేశిస్తే.. చేసేవాడ్ని.. ఆయన నోటీసు ఇస్తే వివరణ ఇచ్చేవాడ్ని.. కానీ, నాకు ఉద్వాసన పలికి అవమానించారని వాపోయారు. కాగా, మాజీ మంత్రి ప్రకటనతో ప్రతిపక్ష బీజేపీకి మరో ఆయుధం లభించినట్టయ్యింది. అధికార కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ‘రాజేంద్ర గూఢా కాంగ్రెస్-గెహ్లాట్ ప్రభుత్వం చీకటి వ్యవహారాలున్న రెడ్ డైరీ గురించి బయటపెట్టారు.. అవినీతి, మహిళా అఘాయిత్యాలు, నల్ల కుబేరుల గురించి నిజం తెలిసిన వారు ఇప్పుడు సమాధానం చెబుతారా’ అని రాజస్థాన్ బీజేపీ అధికార ప్రతినిధి షేజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.
2018 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచి తర్వాత 2019 సెప్టెంబరులో కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో గుఢా ఒకరు. సీఎం గెహ్లాట్ తన మంత్రివర్గంలో 2021లో ఆయనకు చోటు కల్పించారు. సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు గెహ్లాట్‌కు మద్దతుగా నిలిచారు. కానీ, కొద్ది నెలల నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. సచిన్ పైలట్‌ను సమర్దించేలా ప్రకటనలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికల జరగనుండగా.. రాజేంద్ర వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.