ఆంధప్రదేశ్ అప్పులపై కేంద్ర క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అప్పు ఉంటే..2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉంది. లోక్‌సభలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రాష్ట్రాల అప్పులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లికితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
2019 మార్చి నాటికి రూ. 2,64,451 కోట్లు ఉండగా.. 2020 మార్చి నాటికి రూ. 3,07,672 కోట్లు.. 2021 మార్చి నాటికి.. రూ. 3,53,021 కోట్లు.. 2022 మార్చి నాటికి రూ. 3,93,718 కోట్లు.. 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 4,42,442 కోట్లకు చేరింది. ఏపీ వాటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో 2019-20లో రూ.1,931 కోట్లు.. అలాగే ఆంధ్రప్రదేశ్ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో 2020-21లో రూ.1,158.53 కోట్లు అప్పు తీసుకున్నారు.
వేర్‌హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 2019-20లో రూ.11.40 కోట్లు.. మైక్రో ఇరిగేషన్ ఫండ్ నుంచి 2020-21లో రూ.616.13 కోట్లు అప్పు ఉంది. క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి 2019-20 నుంచి 2022-23 వరకు రూ.24,311 కోట్లు, ఏపీ సీడ్స్ నుంచి రాష్ట్రం రూ.400 కోట్లు అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి 2022-23లో రూ.450 కోట్లు ఉన్నాయి. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి 2019-20 నుంచి 2022-23 వరకు రూ.6,212 కోట్లు తీసుకున్నారు.