అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ తయారయ్యాడని, యువగళం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి యాత్రలు, కుల సంఘాల మీటింగ్‌లు పెట్టి వాస్తవాలను వక్రీకరిస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. చిరంజీవి అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకుందని, ముద్దాయిలను 24 గంటల్లోనే పోలీసులు కోర్టులో హాజరుపరిచారని చెప్పారు. వాస్తవాలను వక్రీకరిస్తూ బాధిత కుటుంబానికి ట్రైనింగ్ ఇప్పించి ఏమీ అందలేదని చెప్పించే ప్రయత్నం లోకేష్ చేశాడని ధ్వజమెత్తారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే ముని శాపం చంద్రబాబుతో పాటు లోకేష్‌కు కూడా అంటినట్టుందని ఎద్దేవా చేశారు.