జగన్ కడుతున్న ఇళ్లు చేత్తో తోస్తే పడిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ, భారీ జన సందోహంతో దర్శి దద్దరిల్లిందని పేర్కొన్నారు. శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి దర్శి... భౌద్దారామం ఉన్న నేల దర్శి అని వెల్లడించారు. స్వాతంత్య్రం రాకముందే ఎయిర్ పోర్ట్ ఉన్న ప్రాంతం దర్శి అని లోకేశ్ వివరించారు. సైకో పాలనపై మొదటి తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో సైకో పాలనపై మొదటి తిరుగుబాటు దర్శి నుంచే మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో దర్శి ప్రజలు టీడీపీని గెలిపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దర్శిని ఎలా అభివృద్ధి చేస్తామో అందరూ చూస్తారు. జగన్ కొత్త పథకం ప్రారంభించాడు. ఆ పథకం పేరు ఏంటో తెలుసా 'సైకో స్విమ్మింగ్ పూల్స్'. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నా అని బిల్డప్ ఇచ్చాడు జగన్. కానీ కట్టింది ఏంటో తెలుసా? స్విమ్మింగ్ పూల్స్. సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్ల స్కాంకి పాల్పడ్డాడు జగన్. ఉండటానికి పనికిరాని స్థలాలు పేదలకి ఇచ్చాడు. ఆ స్థలాల లెవెలింగ్ పేరుతో మరో రూ.2,200 కోట్లు కొట్టేశాడు. చిన్న వర్షం వస్తేనే ఆ స్థలాలు స్విమ్మింగ్ పూల్స్ లా తయారు అవుతున్నాయి. మొన్న వారం రోజులు వరుసగా వర్షాలు పడ్డాయి. అప్పుడు ప్యాలస్ బ్రోకర్ సజ్జల పరిగెత్తుకుంటూ జగన్ దగ్గరకు వెళ్లాడు. సార్ సెంటు స్థలాలు అన్ని మునిగిపోయాయి... పునాదులు కూడా కనపడటం లేదు... జనం గోల పెడుతున్నారు అన్నాడట. అప్పుడు జగన్ ప్యాలస్ బ్రోకర్ ని రెండు పీకాడు. ఈత కొట్టుకుంటూ వెళ్లు పునాదులు కనిపిస్తాయి అన్నాడు. జగన్ కడుతున్న ఇళ్లు సంసారానికి పనికిరావు అని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే మరీ అంత ఘోరంగా కడుతున్నారా అనుకున్నా. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు చూశాను. చేత్తో తోస్తే గోడలు పడిపోతున్నాయి. అంత చెత్త ఇళ్లు కడుతున్నాడు జగన్. ఇప్పటి వరకూ ఇందిరమ్మ ఇళ్లే చెత్త ఇళ్లు అనుకుంటే, ఆ రికార్డ్ ని జగన్ బద్దలు కొట్టాడు. అని నారా లోకేశ్ విమర్శించారు.