అమెరికాలోని హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించాయి. యుద్ధ విధ్వంస ప్రాంతాల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని టెక్సాస్ గవర్నర్ ప్రశంసించారు. ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30 నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ కావడం విశేషం. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది శ్రీశ్రీ రవిశంకర్కు మరొక అరుదైన గౌరవం లభించింది. శ్రీశ్రీ రవిశంకర్ గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడాలోని నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి. ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకరే కావడం విశేషం. ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచం నలుమూలలా.. శాంతి, సమగ్రతను వ్యాపింపజేయడమే కాకుండా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురూజీ. భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కిందని ఆ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచానికి గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుందని పేర్కొన్నారు.