మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఆ రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. మహిళలపై జరిగిన ఈ ఘటన అత్యంత భయంకరమైందని.. అమానవీయకరమైందని పేర్కొంది. ఈ ఘటనలో మణిపూర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఘటన జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేందుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని మణిపూర్ పోలీసులను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మణిపూర్ ఘటన బాధితులకు న్యాయం దక్కాలన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మణిపూర్‌లోని మహిళలపై జరిగిన దారుణాలపై సుప్రీం కోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా మణిపూర్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు 14 రోజులు పట్టిందా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీసింది. ఈ సందర్భంగా ఆయుధాలు కలిగి ఉన్న అల్లరి మూకకు ఇద్దరు మహిళలను అప్పగించిన మణిపూర్ పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేయడాన్ని తాము కోరుకోవడంలేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అందులో మహిళా జడ్జిలతో పాటు పలువురు నిపుణులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
మణిపూర్ ఘటన విచారణ సందర్భంగా మణిపూర్ పోలీసులపై సుప్రీంకోర్టు.. ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంతటి ఘోరమైన సంఘటన మే 4 వ తేదీన జరిగితే.. పోలీసులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించింది. ఘటన జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు 14 రోజులు ఎందుకు ఆగారని నిలదీసింది. ఆ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత (జూన్ 24న) దాన్ని మేజిస్ట్రేట్ కోర్టుకు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారని వరుస ప్రశ్నలు సంధించింది. పోలీసులే ఇద్దరు మహిళలను అల్లరి మూకకు అప్పగించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని.. దీంతో ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడానికి వీలు లేదని పేర్కొంది.
ఈ సందర్బంగా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. ఘటన జరిగి 3 నెలలు అయిందని గుర్తు చేసింది. ఇప్పటికే సమయం మించిపోతోందని.. అన్నీ కోల్పోయిన బాధిత మహిళలకు వెంటనే న్యాయం అందాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇదే సమయంలో మణిపూర్‌లో ఇప్పటివరకు నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందించాలని.. ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు మణిపూర్ ఘటనల్లో బాధిత కుటుంబాలకు ఏ రకమైన సాయం అందుతుందో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.