సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం వైయస్ జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో సమగ్ర భూసర్వేపై దృష్టిపెట్టాలని, డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. అలానే ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని, ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.