ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభలో నిశబ్ధంగా ఉండాలి,,,,పార్లమెంటులో ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరికలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 08:38 PM

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్.. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు.. ప్రయోగిస్తోందన్న ఆరోపణలు విపక్ష నేతలు తరచూ చేస్తున్నారు. రాజకీయంగా బీజేపీయేతర పార్టీలను బెదిరించేందుకే.. ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పార్టీలో ముఖ్యనేతలపైకి దర్యాప్తు అధికారులను ఉసిగొల్పి.. వారి గొంతునొక్కేలా చేయడమో లేక.. బీజేపీలో చేరేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపయోగిస్తోందని దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ సాక్షిగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. సభలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు నిశ్శబ్ధంగా ఉండాలని.. లేకపోతే వారి ఇళ్లకు ఈడీ అధికారులు వస్తారని సాక్షాత్తు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి బహిరంగంగా హెచ్చరికలు చేశారు.


సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కేంద్రం ఇటీవల ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేందుకు జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023 ను.. ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు పేరుతో లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో బీజేపీ ప్రభుత్వానికి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండటంతో సులభంగా ఆమోదం పొందింది. అయితే ఈ అత్యంత వివాదాస్పద బిల్లుపై ప్రతిపక్షాలు లోక్‌సభలో తీవ్ర నిరసనలు చేశారు. విపక్షాల ఆందోళనల మధ్య సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత గురువారం లోక్‌సభ ఆమోదించింది. అయితే బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులు సైలెంట్‌గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ అధికారులు వస్తారని ఆమె బెదిరించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.


ఈ క్రమంలోనే కేంద్రమంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్.. తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని.. తాము తరచూ చెప్తున్న విషయం ప్రస్తుతం మీనాక్షి లేఖి వ్యాఖ్యలతో నిజమయ్యాయని ఆక్షేపించారు. ఆవేశంలో మీనాక్షి లేఖి విపక్షాలను బెదిరించే ప్రయత్నం చేశారని.. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆమె వ్యాఖ్యలే సాక్ష్యమని ఎన్సీపీ తెలిపింది. కేంద్ర మంత్రి చేసినవి హెచ్చరికలా లేక బెదిరింపులా అని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ బీవీ స్పందిస్తూ మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రతిపక్షాలను ఒక కేంద్రమంత్రి బెదిరించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని తృణముల్ కాంగ్రెస్ దుయ్యబట్టింది.


ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఈ బిల్లును సమర్థించిన.. మీనాక్షీ లేఖి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఒక పావు శాతం ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి సగం అధికారం ఉంటుందని ప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని.. అందువల్ల కేజ్రీవాల్‌ను 1/4 వంతు ముఖ్యమంత్రే అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని.. అందువల్ల కేజ్రీవాల్‌ను 1/4 వంతు ముఖ్యమంత్రే అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com