మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు సూరత్ కోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్షపై.. సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని.. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తరహా వ్యాఖ్యలు మంచివి కావని గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ కోరుకుంటారని ధర్మాసనం పేర్కొంది.
మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో తాను నిర్దోషిని అని.. తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను శుక్రవారం చేపట్టింది. రాహుల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు‘మోదీ కాదని సింఘ్వీ వాదించారు. ఆయన మోదీ అనే ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ నేరస్థుడు కాదని.. బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై ఉద్దేశపూర్వకంగా ఎన్నో కేసులు వేసినప్పటికీ.. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిపారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఓ సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడగా.. లోక్‌సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్టుకు చేసుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో శిక్షను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.