అణగారిన వర్గాలకు బాసటగా, తెలంగాణ ఉద్యమంలో వీరుడిగా నిలిచిన గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ (74) కన్నుమూశారు. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్ అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని భావిస్తుండగా.. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. గద్దర్‌కు గురువారం బైపాస్ సర్జరీ చేశామని అపోలో స్పెక్ట్రా సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ దాసరి ప్రసాదరావు తెలిపారు. గద్దర్ చాలాకాలంగా ఊపిరితిత్తులు, మూత్రాశయ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయని, పలు అవయవాలు విఫలమవడం, వయోభార సమస్యలతో మృతి చెందారని ప్రకటించారు.