కృష్ణా జిల్లాలో నమోదైన యువకుడి మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మృతుడి స్నేహితుడే భార్యతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన గ్రంథి పురుషోత్తం పాత కార్లు కొని విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు.. ఆయనకు వివాహం కాలేదు. గత నెల 31న కారు కొనడానికి రాజమండ్రి వెళ్తున్నానని తన సోదరుడు నాగేశ్వరరావుకు చెప్పాడు. అలా వెళ్లిన పురుషోత్తం రాజమండ్రి వెళ్లకుండా విజయవాడ మొగల్రాజపురంలో ఉండే స్నేహితుడు బలగం మొహిందర్‌ను కలిశాడు.. ఆ తర్వాత ఇద్దరు కలిసి కారులో యనమలకుదురు నేతాజీనగర్‌లో ఉన్న మొహిందర్ ఇంటికి వెళ్లారు.
ఆ తర్వాత పురుషోత్తం కనిపించకుండా పోయాడు.. అతడి గురించి ఆరా తీసినా ఆచూకీ తెలియలేదు. పురుషోత్తం ఎక్కువగా తన స్నేహితుడైన బలగం మొహిందర్ దగ్గరకు వెళుతుంటాడు. అలాగే రాజమండ్రి అని చెప్పి వెళ్లిన రోజు కూడా పురుషోత్తం మొహిందర్ ఇంటికి వెళ్లిన విషయం గుర్తుకొచ్చింది. దీంతో పురుషోత్తం కుటుంబ సభ్యులు మొహిందర్‌ను అడిగారు.. అయితే తనతో పని ఉందని చెప్పి మధ్యలోనే పురుషోత్తం వెళ్లిపోయాడని బదులిచ్చాడు. పురుషోత్తంకు చెందిన రెండు మొబైల్స్‌కు కాల్ చేసినా చేయగా స్విచ్చాఫ్ వచ్చాయి. పురుషోత్తం సోదరుడు నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది.
పోలీసులకు పురుషోత్తం స్నేహితుడు మొహిందర్‌పైనే అనుమానం వచ్చింది. వెంటనే అతడితో పాటూ భార్య శశికళను అదుపులోకి తీసుకున్నారు. భార్యాభర్తల్ని ప్రశ్నిస్తే అసలు కథ మొత్తం బయటపడింది. పురుషోత్తం, మొహిందర్ ఎప్పటి నుంచో స్నేహితులు.. మొహిందర్ విజయవాడలో ఒక కార్ల కంపెనీలో పనిచేసే సమయంలో శశికళతో పరిచయం కాగా.. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. పురుషోత్తం దగ్గరుండి మొహిందర్, శశికళల వివాహం జరిపించాడు. అప్పటి నుంచి పురుషోత్తం మొహిందర్ ఇంటికి తరచుగా వచ్చి వెళుతుండేవాడు.
గత నెల 31న పురుషోత్తంను యనమలకుదురులోని తమ ఇంటికి మొహిందర్ తీసుకెళ్లాడు.. అక్కడ ఫుల్‌గా మద్యం తాగించాడు. మొహిందర్ తన భార్య శశికళ సహకారంతో పురుషోత్తం మెడకు వైరు బిగించి హతమార్చారు. పురుషోత్తం దగ్గర ఉన్న సుమారు రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకున్నారు. భార్యాభర్తలు కలిసి కారులో పురుషోత్తం మృతదేహాన్ని ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరకు తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. పురుషోత్తం దగ్గర అపహరించిన బంగారు ఆభరణాలను గుంటూరులో విక్రయించి డబ్బులు తీసుకున్నారు.
పురషోత్తం గురించి అడిగినా మొహిందర్, శశికళ ఏమీ తెలియనట్లు డ్రామా ఆడారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రశ్నించడంతో ఈ దారుణం బయటపడింది. పురుషోత్తం మృతదేహం కోసం గోదావరిలో పోలీసులు వెతికినా దొరకలేదు.. అతడి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భార్యాభర్తలపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పురుషోత్తం మొహిందర్, శశికళ పెళ్లి దగ్గరుండి చేస్తే.. నమ్మించి ఇంటికి పిలిచి ఇంత దారుణంగా హత్య చేయడం కలకలంరేపింది. పురుషోత్తంను బంగారం కోసం హత్య చేశారనే వాదన వినిపిస్తుండగా.. శశికళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు హత్య చేశారని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.