గ్రామీణ ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఉన్నత కుటుంబాల్లో పుట్టిన విద్యార్థులు కూడా సాహసం చేయని రీతిలో.. ‘పైలట్ వ్యోమగామి’గా రాణించాలని కలలు కంది. ఆ అమ్మాయి తన కలను నెరవేర్చుకునేందుకు సీఎం జగన్ అండగా నిలబడ్డారు. ఆమే.. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అనే అబ్దుల్ కలాం స్ఫూర్తి వచనాలను నిజం చేస్తున్న ఈ అమ్మాయి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకొని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థిని ‘ఉన్నత కల’ను సాకారం చేసేందుకు అండగా నిలబడ్డారు. జాహ్నవికి ‘వ్యోమగామి శిక్షణ’ కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా కల్పించారు. జాహ్నవి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు అయ్యే శిక్షణ కోసం ఖర్చును భరించే శక్తి ఆమె కుటుంబానికి లేదు. దీంతో గతంలో సీఎం జగన్‌ను కలిసి సాయం కోరింది. కిందటిసారి రాజమండ్రి పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి సాయం కోరగా.. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున వెంటనే రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. విదేశాల్లో పైలట్ శిక్షణ తీసుకుంటున్న జాహ్నవి.. వ్యోమగామి శిక్షణ తీసుకునేందుకు తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి సాయం కోరింది. సీఎం జగన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు.
రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న సీఎం జగన్‌ను జాహ్నవి కలిసింది. వ్యోమగామి అవ్వాలన్న తన కోరికను అర్థం చేసుకొని ఉన్నత చదువుకు చేసిన సాయానికి వైఎస్ జగన్‌కు జాహ్నవి, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
గతంలో ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుంచి సైంటిస్ట్ వ్యోమగామి అభ్యర్థిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నారని సీఎం జగన్‌కు.. సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ తెలిపారు. ఇప్పటికే జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిందని చెప్పారు. భారత సంతతి వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్ఫూర్తితో అంతరిక్షంలోకి అడుగుపెట్టాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు జాహ్నవి తెలిపింది.