మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరంగా భావించి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తాను 1983 నుంచి టీడీపీలో ఉన్నానని.. రెండేళ్ల క్రితం రాజీనామా చేశానన్నారు. మహిళలు, యువతకు మేలు చేసే పవన్ ఆలోచనలు, నిర్ణయాలు నచ్చాయన్నారు. ఈ నెల 10న విశాఖలో జరగనున్న వారాహి యాత్రలో పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. నియోజక వర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానన్నారు అరుణ. మాజీ మంత్రి ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
పడాల అరుణ విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. . 2009లో చివరిసారి తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు.. ఆ తర్వాత 2021లో పార్టీకి రాజీనామా చేశారు. 33 ఏళ్లు తాను టీడీపీ కోసం పనిచేశానని.. సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. పార్టీలో కొనసాగలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనకు అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వలేదని.. కనీసం రాష్ట్ర కమిటిలలో సైతం చోటు కల్పించలేదన్నారు. ఆ తర్వాత అరుణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పడాల అరుణ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలని భావించారు. అందుకే జనసేన పార్టీ వైపు మొగ్గు చూపారు.. తన అనుచరులు, పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పడాల అరుణ చేరిక ఉమ్మడి విజయనగరం జిల్లాలకు తమకు కలిసొస్తుందని జనసేన పార్టీ భావిస్తోంది. అరుణ మంత్రిగా కూడా పనిచేశారని.. ఆ అనుభవం తమకు ప్లస్ అవుతుందంటున్నారు. అరుణ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.