అరకు ఎంపీ మాధవి సోదరుడు, వైసీపీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మహేష్ సోమవారం ఉదయం ఎంపీ ఫొటోగ్రాఫర్ రాముతో కలిసి శరభన్నపాలెం నుంచి కొత్తపాలెం మీదుగా ఎర్రబొమ్మలకు బైక్‌పై వెళుతున్నారు. మార్గ మధ్యలో కొత్తపాలేనికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏనుగురాయి దగ్గర డౌన్ దిగుతుండగా బైక్ బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న మహేష్ ముఖం, తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అదే సమయంలో ఏర్రబొమ్మల నుంచి రామరాజుపాలెం వస్తున్న ఓ వ్యక్తి ప్రమాదం గురించి ఎంపీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి వారి వాహనంలో నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించగా.. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో విశాఖపట్నం తరలించారు. డాక్టర్లు మహేష్‌కు వైద్యం అందిస్తున్నారు.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎంపీ మాధవి సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.