అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వరుసగా నాలుగో ఏడాదీ వైయస్ఆర్ సున్నా వడ్డీ (మహిళలు) పథకం అమలుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నేడు జమ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ఈ రూ.1,353.76 కోట్లతో కలిపి వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తోంది. బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైయస్ఆర్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా, వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైయస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది.