గోంగూర తో పచ్చడి చేసుకుంటాం, లేకపోతే పప్పు, మసాలా కర్రీ ... ఇలాంటి వెరైటీలు అందరికి తెలుసు కానీ గోంగూరతో పులిహోర చేసుకోవచ్చని కొంతమందికి తెలియదు. అలాంటి వారి కోసం... గోంగూరతో పులిహోర ఎలా చెయ్యాలో తెలిపే విధానం ఇక్కడ ఉంది. ఒకసారి చదివి, ఇంట్లో ట్రై చెయ్యండి.
కావలసిన పదార్థాలు: బియ్యం : 1/4 గ్లాస్, గోంగూర కట్టలు : 4, పల్లీలు : 2 టీ స్పూన్లు, పసుపు : చిటికెడు, ఉప్పు : తగినంత, పచ్చిమిరపకాయలు : 8, ఇంగువ: చిటికెడు, నూనె : 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు - కొద్దిగా, కరివేపాకు- ఒక రెమ్మ.
తయారీవిధానం: ముందుగా బియ్యాన్ని తీసుకుని పొడి పొడి గా అన్నం వండుకుని చల్లారబెట్టుకోవాలి. అన్నం చల్లారేలోపు గోంగూర ఆకులను కోసి నీటితో బాగా శుభ్రం చెయ్యండి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి కాగాక,పచ్చిమిర్చిని, కడిగిన గోంగూరను వేసి ఉడికించుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత పప్పుగుత్తి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల గోంగూర గుజ్జుగా మారి అన్నంలో ఇట్టే కలిసిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద మరో బాణలి పెట్టుకొని తాలింపుకు సరిపడా నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో తాలింపు దినుసులను ఒక్కొక్కొటిగా వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చనాపప్పు, సాయి పెసరపప్పు, పల్లీలు, ఎండు మిర్చి,2 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందుకో కొంచెం పసుపు, కరివేపాకు, ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపును, మెత్తగా చేసిన గోంగూరను చల్లార్చిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకేముంది ... ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర రెడీ.