విశాఖపట్నంలో లివిన్ అడ్వెంచర్స్ సంస్థ వ్యవస్థాపకులు, రిటైర్డ్ సబ్మెరైనర్ బలరామనాయుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సముద్ర అంతర్భాగాన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన తన సంస్థ ద్వారా ఇక్కడ స్కూబా డైవింగ్ శిక్షణ ఇస్తున్నారు. తరచూ సముద్రం లోపలకు తన సహచరులతో కలిసి వెళ్లి ప్లాస్టిక్, ఇతర చెత్తను ఏరి బయటకు తీసుకువస్తుంటారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించాలని సముద్ర ఉపరితలం నుంచి 60 అడుగుల కిందికి వెళ్లి అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారికి ఇవే తమ నివాళులని ప్రకటించారు.