టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజులుగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు బాహుబలి పూతరేకుల దండతో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు ఏకంగా మూడు వేల పూతరేకులతో 32 అడుగుల భారీ గజమాల తయారుచేయించారు. రావులపాలెంలో చంద్రబాబుకు క్రేన్ సహాయంతో ఈ పూతరేకుల గజమాలను వేశారు.
ఆత్రేయపురంకు చెందిన ఛాధస్తం పుతరేకుల తయారీ షాప్ నిర్వాహకులు ఈ గజమాలను తయారుచేశారు. 10 మంది రెండు రోజులు పగలు, రాత్రి కష్టపడి ఛాధస్తం షాపు నిర్వాహకులు దీనిని తయారుచేశారు. చంద్రబాబు కోనసీమ పర్యటనలో ఈ దండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆత్రేయపురం పుతరేకులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఆత్రేయపురం పూతరేకులతో బాహుబలి దండ తయారుచేసి మరోసారి ఆకట్టుకున్నారు.
దీంతో అతిధులకు ఆతిధ్యం, ఆప్యాయత అనురాగాలకు పెట్టిన పేరు కోనసీమ అని మరోసారి నిరూపించారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఇవాళ అమలాపురంలో డాక్టర్లు, టీచర్లు, లాయర్లతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ది కోసం బాబు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలని సూచించారు. విజన్-2047 డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతిరథంలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మేథావులు, నిపుణుల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరిస్తానని, ఎవరైతే రాష్ట్రాభివృద్ది చేస్తారో ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. కులం, మతం, ప్రలోభాలకు లొంగితే రాష్ట్రం దెబ్బతింటుందని చంద్రబాబు తెలిపారు.