ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయంటున్నారు.
మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు శుక్రవారం నుంచి ఈ నెల 21వరకు వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇవాళ తూర్పుగోదావరి, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందుంటున్నారు.
కోస్తా ప్రాంతంలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 26.8 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా కైకలూరులో 24.2, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 22.24 మిల్లీ మీటర్లు.. రాయలసీమలోని తిరుపతి జిల్లా సత్యవేడులో 46.2 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా నగరిలో 33.4, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 33.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొం డలో గురువారం సాయంత్రం భారీ వాన పడింది. సాయం త్రం ఐదు గంటల నుంచి 6.30 గంటల వరకు ఏకధా టిగా వాన కురవడంతో పట్టణంలో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యా యి. చిత్తూరు జిల్లాలో కూడా 18 మండలాల్లో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నిండ్ర మండలంలో 45.6 వర్షపాతం నమోదైంది. నగరిలో 33.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు తెలంగాణకు కూడా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని చెబుతున్నారు. ఇవాళ, రేపు అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.