మన దేశంలోని పరిశోధన సంస్థ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రోకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఇండియా జాబిల్లిపై కాలిడింది. మనం చరిత్ర సృష్టించాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ను విజయవంతంగా నిలిపినందుకు ఇస్రోకు శుభాకాంక్షలు. వారి సంకల్పబలానికి, స్ఫూర్తికి ఇదే నా సెల్యూట్. చంద్రయాన్-3 విజయం భారత అంతరిక్ష పరిశోధనను చంద్రుడిని దాటుకుని కొంత పుంతులు తొక్కించింది. అనంతమైన ఓ మహాప్రయాణం ప్రారంభంలో భారత్ నిలిచింది. మనకిక ఎదురేలేదు’’ అంటూ చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘తమ మనసైన వారిని చంద్రుడిపై చేరుస్తామంటూ ఎందరో కవులు, కళాకారులు తమ భావాలకు అక్షరరూపమిచ్చారు. కానీ ఇస్రో మాత్రమే ఈ కలను సాకారం చేసి చూపింది. ఈ క్షణం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ని దించిన ఇస్రోకు హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని నారా లోకేశ్ *ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు.