టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2,600 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. శనివారం నూజివీడు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి క్యాంప్ సైట్ నుంచి 195వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభించిన లోకేశ్... ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2600కి.మీ. మైలురాయికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సింహాద్రిపురం వద్ద శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తి చేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందిస్తామని హామీ ఇస్తూ లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.