అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలుపొందారని ఆరోపించారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లతో గెలుపొంది పచ్చి అబద్దాలు చెబుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాల తడుముకున్నట్లుగా ప్రకాష్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే డబుల్ ఓట్లు... ప్రొద్దుటూరుకు చెందినవారిని తోపుదుర్తిలో ఓటర్లుగా చేర్చారన్నారు. గత ఎన్నికల్లోనూ ప్రొద్దుటూరుకు చెందిన వారు వాహనాల్లో తిరిగుతూ హడావుడి చేశారన్నారు. ఇంటింటి ఓటర్ సర్వేకి వచ్చిన వారిని ఎమ్మెల్యే సోదరుడు బెదరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు ఎక్కించారు కాబట్టే దౌర్జన్యంకు దిగుతున్నారన్నారు. చనిపోయిన వారు ఓట్లు వేస్తారా అంటూ తొలగించకుండా అడ్డుకుంటున్న ప్రకాష్ రెడ్డి వారి ఓట్లను వేసుకుంటారన్నారు. ‘‘నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు నా ఊరిలో దొంగ ఓట్లు ఉన్నాయో... తోపుదుర్తిలో దొంగ ఓట్లు ఉన్నాయో చర్చకు సిద్ధం’’ అని మాజీ మంత్రి స్పష్టం చేశారు.