చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో నమోదైన కేసులలో టీడీపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా, పీలేరు టీడీపీ ఇంఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్ పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. అలాగే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు పై నమోదైన 7 కేసుల్లో నాలుగింటిలో ముందస్తు బెయిల్ రాగా.. మరో మూడు కేసుల్లో బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది.
ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ముగ్గురు నేతలు నాలుగు వారాల పాటు అన్నమయ జిల్లాకు వెళ్లకూడదని ఆదేశింది. ప్రతి ఆదివారం కర్నూల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని షరతులు విధించింది. మరోవైపు పుంగనూరు, అంగళ్లు సంఘటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాను ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసేది లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పారు. తనకి సంబంధం లేకపోయినా తనపై కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడిచేసి తనపైనే కేసులు నమోదు చేశారని చంద్రబాబు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటనల్లో భాగంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పుంగనూరు, అంగళ్లులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. పుంగనూరులో పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి.. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.