సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న.. దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి స్మారక రూ.100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో.. జేపీ నడ్డా, చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలయ్యతో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎంపీలు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరయ్యారు. నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ స్మారక నాణెంను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నందమూరి తారక రామరావు శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతం అన్నారు. ఎన్టీఆర్ రామాయణ ,మహాభారతాలకు అనేక పాత్రలలో జీవించారని.. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారన్నారు. పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు.
ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరన్నారు పురందేశ్వరి. మహిళకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని.. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ ఒకతరం హీరో మాత్రమే కాదని.. అన్ని తరాలకు ఆదర్శ హీరో అని పురందేశ్వరి కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు హాజరుకాలేదు. తారక్ దేవర సినిమా షూటింగ్ కారణంగా వెళ్లలేకపోయారని చెబుతున్నారు. కళ్యాణ్‌రామ్ కూడా కొన్ని అనివార్య కారణాలు వల్ల హాజరుకాలేకపోయినట్లు చెబుతున్నారు.