ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవితంలో కష్టాలను దాటుకుని ,,,,పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న ఆటో డ్రైవర్ భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 07:51 PM

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి.. వాటన్నింటిని దాటుకుని ముందుకెళితేనే అనుకున్న లక్ష్యాలను అందుకోవచ్చు. అవును నిజమే.. ఈ సాధారణ మధ్యతరగతి మహిళ కూడా జీవితంలో ఎదురైన కష్టాలను జయించి అనుకున్నది సాధించారు. ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే.. ఏకంగా పీహెచ్‌డీ పట్టాను అందుకుంటున్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. కుటుంబ పరిస్థితులు అవరోధంగా మారినా సరే భర్త ప్రోత్సాహంతో ఉన్నత లక్ష్యాలను చేరుకున్నారు.


గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరుకి చెందిన ఈపూరి షీలా తల్లి చిన్నతనంలోనే మరణించారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివారు. తెనాలిలో ఇంటర్‌ తర్వాత జేఎంజే మహిళా కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతుండగా.. 2003లో ఆటోడ్రైవర్‌ రావూరి కరుణాకర్‌తో పెద్దలు వివాహం చేశారు. షీలాకు వివామైనా చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన భర్త కరుణాకర్ అప్పటి నుంచి ప్రోత్సహించారు. రెండేళ్లు చదివాక ఫైనలియర్‌లో మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉపాధి కోసం 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్‌గా చేరారు. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్‌ శిక్షణలో చేరి పీజీడీసీఏ పూర్తి చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, డిగ్రీ అర్హత లేకపోవటంతో వెనక్కు రావాల్సి వచ్చింది.


షీలా మొత్తానికి 2009లో డిగ్రీ ఫైనలియర్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత తెనాలిలోని ఓ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేశారు. ఎయిడెడ్‌ కాలేజీలో లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తు చేయగా.. పీహెచ్‌డీ తప్పనిసరిగా చెప్పటంతో పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేశారు. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూఆర్‌సీటీ నోటిఫికేషన్‌ రావడంతో.. భర్త ప్రోత్సాహంతో దరఖాస్తు చేశారు. యూనివర్సిటీలో డాక్టర్‌ ఎన్‌.రత్నకిషోర్‌ గైడ్‌గా ఫుల్‌టైం రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆర్థిక సమస్యలతో ఆగిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ 2016లో రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికకావడంతో ఆ కష్టాలు తీరిపోయాయి.


షీలా రోజూ యూనివర్సిటీకి వెళ్లి అక్కడి లైబ్రరీలో చదువుకుంటూ 2016 సెప్టెంబరులో ఏపీసెట్‌ అర్హత సాధించారు. డిస్టెన్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ ఎంహెచ్‌ఆర్‌ఎంను 2017లో పూర్తిశారు. అదే ఏడాది ఎంఫిల్‌ నుంచి పీహెచ్‌డీకి కన్వర్షన్‌ కాగా.. గతేడాది ఆఖరులో 'సర్వీస్‌ క్వాలిటీ ఇన్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌' (ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత) అనే అంశంపై పరిశోధన చేశారు. ఆ థీసిస్‌కు గత జులై 4న పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో ఇవాళ (మంగళవారం) డాక్టరేట్‌ను అందుకుంటున్నారు. ప్రస్తుతం తెనాలిలోని వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కళాశాలలో కామర్స్‌ అధ్యాపకురాలిగా పని చేస్తున్న షీలా.. ప్రభుత్వ అధ్యాపకురాలు కావాలన్నది తన లక్ష్యం అంటున్నారు.


షీలాకు ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమారుడు, ఇంటర్‌ చదువుతున్న కుమార్తె ఉన్నారు. అయినా సరే పిల్లలతో పాటు భర్త షీలాను చదివించారు. కుటుంబం కోసం తన భర్త ఎంతో కష్టపడ్డారని.. తాను ఏం సాధించినా అది భర్త ఘనతే అని చెప్పుకొచ్చారు. భర్త ప్రోత్సాహంతో పీహెచ్‌డీ పూర్తి చేశానని.. ఓవైపు పిల్లల బాగోగులు చూసుకుంటూనే పీహెచ్‌డీ పూర్తి చేసి తన లక్ష్యాన్ని సాధించానంటున్నారు షీలా. ఆగిపోయిన చదువు ఇక్కడిదాకా వస్తుందని అనుకోలేదని.. పీహెచ్‌గడీ అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.


ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన సాకే భారతి కూడా కూలి పనులు చేసుకుంటూ.. ఏకంగా కెమెస్ట్రీలో పీహెచ్‌డీ పట్టాను అందుకున్న సంగతి తెలిసిందే. భారతి జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.. అలాగే ప్రభుత్వం కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడి సాయం చేసింది. ఇప్పుడు షీలా కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు.. భర్త ఆటో డ్రైవర్. అయినా సరే కష్టపడి పీహెచ్‌డీ పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని అందుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa