ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలు.. మరోవైపు చంద్రబాబు టూర్, నారా లోకేష్ పాదయాత్రతో బిజీ అయ్యారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయ యాత్ర అంటూ జనాల్లోకి వెళుతున్నారు. అలాగే ఓటర్ల జాబితా విషయంలోనూ అధికార, విపక్షాల మధ్య వార్ నడుస్తోంది.. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి రెండు పార్టీలు ఫిర్యాదులు ఇచ్చుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ముందుగానే ఎన్నికల వేడి మొదలైంది.. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి సరికొత్త ప్రచారం మొదలైంది.
చంద్రబాబు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో.. వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి కుప్పంతో పాటుగా మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో గెలవాలని వైఎస్సార్‌సీపీ పట్టుదలతో ఉంది. ఆ దిశగా వైఎస్సార్‌సీపీ కార్యాచరణను అమలు చేస్తోంది
కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. మున్సిపాలిటీ సహా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, పంచాయతీల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రివ వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. కుప్పానికి అవసరమైన నిధుల్ని కేటాయించారు.. వచ్చే ఎన్నికల్లో భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వై నాట్ 175.. వై నాట్ కుప్పం అంటూ వైఎస్సార్‌సీపీ సరికొత్త నినాదాలను అందుకుంది.
ఈ కారణాలకు తోడు.. టీడీపీకి 2019 ఎన్నికల ఫలితాలు ఒకింత షాకిచ్చాయి. వైఎస్సార్‌సీపీ మొదటి రెండు రౌండ్లలో లీడ్‌లోకి వచ్చింది.. దీంతో టీడీపీ కొద్దిసేపు టెన్షన్ పడింది. అలాగే చంద్రబాబుకు మెజార్టీ కూడా భారీగా తగ్గింది. అందుకే 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో వైఎస్సార్‌సీపీ బలం పెరిగిందనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ చూసిన చంద్రబాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారని.. అందుకే రెండు స్థానాల్లో పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఈసారి కుప్పంతో పాటుగా మరో నియోజకవర్గంలో బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో టీడీపీ బలంగా ఉండే ఓ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే చంద్రబాబు తొలిసారి ఇలా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినట్లు అవుతుంది. మరి ఈ ఊహాగానాలపై టీడీపీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.