ప్రతి దశలోనూ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నామని, రైతన్నకు తోడుగా ఈ నాలుగేళ్ల పాలనలో అనేక గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా ‘వైయస్‌ఆర్ రైతు భరోసా’ సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పారు. వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా కౌలు రైతులకు వైయస్‌ఆర్ రైతు భరోసా కింద సీసీఆర్‌సీ కార్డులు పొందిన 1,46,324 మంది కౌలు రైతుల ఖాతాల్లో రూ.109.74 కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.11 కోట్లు జమ చేశారు.