దక్షిణాసియా ఉపఖండంలో రెండు విభిన్న పరిస్థితులు, స్వభావాలకు ప్రతిరూపం ఇండియా, పాకిస్తాన్. లౌకిక, ప్రజాతంత్ర దేశమైన భారత్ తన 76 ఏళ్ల ప్రయాణంలో అనేక మైలురాళ్లు దాటింది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అంచనాలకు మించిన ఆర్థికాభివృద్ధి సాధించింది ఇండియా. మరి సోదర దేశంగా పరిగణించే పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. పేరుకు ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంగా ఉన్నా అక్కడ పదవీకాలం ముగిసిన చట్టసభలకు ఎన్నికలు నిర్ణీత గడువులోగా జరుగుతాయో లేదో చెప్పలేని స్థితి నెలకొని ఉంది. దివాలాకోరు ఆర్థిక విధానాలకు తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు ఈ దేశం అంతర్జాతీయ ఆర్థికసంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతోంది. ఆరంభం నుంచీ ఆర్థిక ప్రగతిపై కన్నా సైనిక బలంపైనే దృష్టి పెట్టిన పాకిస్తాన్ ను నిలకడలేని విధానాలే నిలువునా ముంచుతున్నాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంకు కవల సంస్థ అయిన అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి పాక్ 25 సార్లు ఆర్థిక సహాయం పొందింది. ప్రజాస్వామ్య దేశంగానే గాక ఆర్థిక వ్యవస్థగా పాక్ ‘విఫల రాజ్యం’ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద కారణం ఏదీ అవసరం లేదు. రోజు రోజుకు అప్పుల ఊబిలో దిగబడిపోతూ అత్యధిక ద్రవ్యోల్బణంతో పాక్ ముందుకు సాగుతోంది. చివరి నిమిషంలో రుణాల ఎగవేతదారు అనే ముద్రపడకుండా ఉండడానికి ఐఎంఎఫ్ నుంచి మొన్న పాక్ సర్కారు 300 కోట్ల డాలర్ల బెయిలవుట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నంగా పూర్వపు షహబాజ్ షరీఫ్ సర్కారు వస్తు సేవల పన్నును 18 శాతానికి పెంచింది. అక్కడ లీటరు పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 272, 280 పాక్ రూపాయలు పలుకుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అన్వరుల్ హక్ కాకర్ నేతృత్వంలో అధికారం చేపట్టిన కొత్త ఆపద్ధర్మ సర్కారు వెంటనే పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంతో పెట్రోలు ధర 290 పాక్ రూపాయలైంది.