న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు.. సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లుగా పని చేసి రిటైర్ అయిన వారు రాజకీయాల్లోకి రావడం పట్ల అనేక అపోహలు, అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చాలా మంది న్యాయవ్యవస్థ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే.. దానికి రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని అందుకే పదవీ విరమణ తర్వాత పార్టీల్లో చేరుతున్నారనే అపవాదు కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు పనిచేసి.. ఇటీవలె రిటైర్మెంట్ తీసుకున్న మాజీ చీఫ్ జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్(డీవై చంద్రచూడ్).. తాజాగా న్యాయవ్యవస్థలో పనిచేసి.. రాజకీయాల్లోకి వచ్చేవారిపై, రావాలనుకుంటున్న వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జడ్జిలు, న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు రాజకీయాల్లోకి రావొచ్చా అనే ప్రశ్నకు జస్టిస్ డీవై చంద్రచూడ్.. సరైన సమాధానం ఇచ్చారు. మన రాజ్యాంగంలో కానీ.. చట్టంలో కానీ.. జడ్జిలు రాజకీయాల్లోకి రాకూడదని.. ఎలాంటి నిషేధాలు లేవని తేల్చి చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించి.. మంగళవారం నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో తాజాగా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన భారత రాజ్యాంగ @75 కాన్‌క్లేవ్‌లో జస్టిస్ డీవై చంద్రచూడ్ పాల్గొన్నారు. అదే సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్న అడగ్గా.. దానికి కూడా సమాధానం చెప్పారు. అయితే తన వయసు 65 ఏళ్లు అని.. జడ్జిగా తన పనితీరుతోపాటు న్యాయవ్యవస్థ నిబద్ధతపై అనుమానాలు కలిగించే ఎలాంటి పనులను తాను చేయబోనని జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.
అయితే న్యాయవ్యవస్థలో పనిచేసిన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా జడ్జిలన ఈ సమాజం అదే కోణంలో చూస్తుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. రిటైర్ అయినా.. వారిని చట్టానికి పరిరక్షించే వారిగానే ప్రజలు చూస్తారని.. అందువల్ల మాజీ న్యాయమూర్తులు అలాంటి పనులే చేయాలని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు చేసే పనులు అన్నీ రిటైర్డ్ జడ్జిలు చేయలేరని పేర్కొన్నారు. అయితే తాను ఇలా అన్నానని.. ఇప్పటివరకు రాజకీయాల్లో చేరిన మాజీ జడ్జిల వ్యవహారశైలి, వారి ప్రవర్తనపై తాను ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయడం లేదని తేల్చి చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలు తీసుకున్న నిర్ణయం, వేసే అడుగు.. ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ప్రతీ ఒక్క రిటైర్డ్ జడ్జి ఆలోచించుకోవాలని హితవు పలికారు. రిటైర్ అయిన వెంటనే రాజకీయాల్లో చేరితే అది తప్పకుండా కొన్ని అనుమానాలకు తావిస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా న్యాయవ్యవస్థపై సోషల్ మీడియా ప్రభావాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. కోర్టుల్లో ఉన్న కొన్ని కేసులను ప్రభావితం చేసేలా కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి పట్ల జడ్జిలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. యూట్యూబ్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో 20 సెకన్ల వీడియోను చూసి.. ప్రజలు ఒక అభిప్రాయానికి రావాలనుకుంటున్నారని.. అయితే అది చాలా ప్రమాదకరమని తెలిపారు. కోర్టు నిర్ణయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని తెలిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్.. అవి కోర్టు నిర్ణయాలకే కాకుండా.. జడ్జిలను వ్యక్తిగత జీవితం వరకు వెళ్తేనే అసలు సమస్య అని పేర్కొన్నారు.