సున్నీ ముస్లింలు మెజారిటీగా ఉన్న పాకిస్తాన్లో ఇప్పుడు షియా, సున్నీ ముస్లింల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. మరీ ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రాం జిల్లాలో మాత్రం షియా ముస్లింలు అధికంగా ఉంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ షియాలకు, సున్నీలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అవి ఇటీవలి కాలంలో తీవ్రం కావడంతో.. ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేసి చంపుకునే స్థాయికి వెళ్లాయి. ఈ ఏడాది మొదటి నుంచి కుర్రాం జిల్లాలో షియా, సున్నీ ముస్లింల మధ్య తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండగా.. తాజాగా కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య కాల్పులు జరుగుతుండటం తీవ్ర ఆందోళనకరంగా మారింది. తాజాగా జరిగిన కాల్పుల్లో 82 మంది చనిపోవడం, 150 మందికి పైగా గాయాల పాలు కావడం సంచలనం రేపుతోంది.
ఈ నేపథ్యంలోనే షియా ముస్లింల కాన్వాయ్‌పై సున్నీ ముస్లింలు కాల్పులకు తెగబడటంతో రెండు వర్గాల మధ్య తాజా హింస చెలరేగింది. ఈనెల 21, 22, 23వ తేదీల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన హింసలో 82 మంది ప్రాణాలు కోల్పోగా.. 156 మంది గాయపడినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. చనిపోయిన వారిలో 16 మంది సున్నీలు ఉండగా.. 66 మంది షియా వర్గానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఇక ఈ కుర్రం జిల్లా ఆఫ్గనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండగా.. అక్కడ బారీగా ఉన్న షియా ముస్లింలు నివసిస్తారు. వీరితో సున్నీ ముస్లింలకు దశాబ్దాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
షియా ముస్లింలకు చెందిన రెండు వేర్వేరు కాన్వాయ్‌లు పోలీస్ ఎస్కార్ట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సున్నీ ముస్లిం వర్గాలు మెరుపుదాడి చేశాయి. ఈ ఘటనలో 43 మంది మరణించడంతో తాజా హింసాత్మక సంఘటనలు ప్రారంభం అయ్యాయి. గురువారం రోజున కుర్రాం జిల్లాలో తమ వర్గం ముస్లింలపై సున్నీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ.. ఆ తర్వాతి రోజు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో షియా ముస్లింలు భారీ ప్రదర్శన చేపట్టారు. షియా ముస్లింలపై ఆకస్మిక దాడి చేసి.. వారిని హత్య చేయడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు.
ఈ హింసాత్మక ఘటనలతో శనివారం సుమారు 300 కుటుంబాలు కట్టుబట్టాలతో పారిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కుర్రం జిల్లా వ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ నిలిపివేశారు. 2018లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో విలీనం అయ్యే వరకు.. కుర్రం జిల్లా సెమీ అటానమస్ ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో భాగంగా ఉండేది. అయితే ఇక్కడ సున్నీ, షియాల మధ్య చెలరేగిన హింసను అరికట్టడానికి పోలీసులు.. గత కొన్నేళ్లుగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం షియా వర్గం వారితో.. ఆదివారం సున్నీ వర్గం వారితో చర్చలు జరిపింది. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి.. సున్నీ, షియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించిన తర్వాత.. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తామని ఖైబర్ పఖ్తుంక్వా న్యాయ శాఖ మంత్రి అఫ్తాబ్ అలామ్ అఫ్రిది తెలిపారు.
ఇక గత నెలలో కుర్రం జిల్లాలో జరిగిన మత ఘర్షణలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 16 మంది చనిపోయారు. ఇక జులై నుంచి సెప్టెంబర్ మధ్య జరిగిన ఉద్రిక్తతల్లో డజన్ల కొద్దీ జనాలు మృతి చెందారు. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం చేయగా.. ఉద్రిక్తతలు తగ్గాయి. ఇక అక్కడ జరిగిన ఘర్షణల్లో జులై-అక్టోబర్ మధ్య 79 మంది మరణించారని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.