ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ లీటర్ పెట్రోల్ ధర రూ.110కి సమీపంలో ఉంది. ఈ క్రమంలో సీఎన్జీ గ్యాస్ ఇంధన వాహనాల వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పుడు వారికీ ధరల షాక్ తగులుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రం పలు నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలను మళ్లీ పెంచింది. అక్టోబర్ నెల చివరి వారంలోనే ధరలను పెంచిన కేంద్రం. ఇప్పుడు మరోసారి రేట్లు పెంచింది. గ్యాస్ కంపెనీలు రిటైల్ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఈ పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
ఆటో మొబైల్లో వినియోగించే సీఎన్జీ, గృహ అవసరాలకు ఉపయోగించే పైప్ గ్యాస్ విక్రయించే ఇంద్ర ప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సంస్థ సీఎన్జీ గ్యాస్ ధరలను కిలోకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ముంబై సహా పలు నగరాల్లో కిలోపై రూ.2 పెరగనుంది. అయితే, ఢిల్లీకి ఈ పెంపు నుంచి ప్రస్తుతానికి మినహాయింపు లభించింది. ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశ రాజధానికి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీలో సీఎన్జీ గ్యాస్ ధర కిలోకు రూ.75.09 వద్ద ఉంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ మినహాయింపు ఇచ్చిన నొయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లో సీఎన్జీ ధరలను పెంచారు. నొయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో కిలో సీఎన్జీ ధర రూ.81.70, గురుగ్రామ్‌లో రూ.82.12 గా ఉంది. ఇక మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎన్జీ గ్యాస్ విక్రయించే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ గ్యాస్ ధరలను కిలోకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గత రెండు నెలలుగా ధరలను స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న అదానీ టోటల్ గ్యాస్ సైతం సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచింది.
ప్రస్తుతం ముంబైలో కిలో సీఎన్జీ ధర రూ.77 వద్దకు ఎగబాకింది. అలాగే ఇతర ప్రధాన నగరాల్లోనూ స్థానిక రిటైలర్లు సీఎన్జీ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పెంపునకు కారణాలను ఆయా సంస్థలు వెల్లడించాలు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో సీఎన్జీ గ్యాస్ ధర రూ.96 వద్ద ఉంది.