ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్ చేరిన భారత్,,,,వెస్టిండీస్ ఔట్..!

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 11:41 PM

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ చేరింది. సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్చువల్ నాకౌట్ లాంటి మ్యాచ్‌లో సత్తాచాటి.. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. 196 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయిన వెస్టిండీస్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు.. సెమీఫైనల్‌లో మార్చి 5న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.


కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను.. ఓపెనర్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.


సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా.. సంజూ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండటంతో సిక్స్‌లు, ఫోర్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు 50 బంతుల్లో 97 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10), సూర్యకుమార్ యాదవ్ (18) విఫలమయ్యారు. తిలక్ వర్మ (15 బంతుల్లో 27 రన్స్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు.


ఈ ఫలితంతో టీ20 ప్రపంచకప్ 2026 లో సెమీ ఫైనల్ బెర్తులు, మ్యాచ్‌లు ఖరారు అయిపోయాయి. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీఫైనల్ చేరాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్.. టాప్-2లో నిలిచాయి. ఇక మార్చి 4న తొలి సెమీఫైనల్ మ్యాచ్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇందులో ఇంగ్లాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. మార్చి 8న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్.. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa