ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను’: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 11:02 PM

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ మహిళతో బీఆర్ నాయుడు చనువుగా మెలుగుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోలు ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే వైరల్ అవుతోన్న వీడియోల విషయమై బీఆర్ నాయుడు ఆదివారం స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసేందుకు, టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రతిష్టను దిగజార్చడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని తన రూపాన్ని అనుకరించేలా వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో వెల్లడించారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు నిజం కావని, వక్రీకరించినవని బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో వైఎస్సారీసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానని నాయుడు స్పష్టం చేశారు.


తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ.. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిని వదిలేది లేదని ఆయన గట్టిగా చెప్పారు.


టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన మండిపాటు..


బీఆర్ నాయుడు వైరల్ వీడియోల విషయమై గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన బీఆర్ నాయుడు వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చాయన్నారు. బీఆర్ నాయుడు వాత్సాయనుడికి వారసుడు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 94 సంవత్సరాల టీటీడీ పాలకమండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు పాల్పడే వ్యక్తిని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా నియమించారని.. ఇది బాధను కలిగించే విషయమని భూమన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదీ బీఆర్ నాయుడు నేపథ్యం..


బీఆర్ నాయుడు 2024 నవంబర్ 6న టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పూర్తి పేరు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. తిరుపతి జిల్లా పెనుమూరు మండలంలోని పూనేపల్లి గ్రామం ఆయన స్వస్థలం. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నాయుడు.. ఉద్యోగ సంఘం నాయకుడిగా పని చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు.. పార్టీ కార్యకలాపాల్లో నాయుడు చురుకైన పాత్ర పోషించారు. వ్యాపారవేత్తగానూ విజయవంతమైన ఆయన.. 2007లో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ను స్థాపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa