ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా తీసుకుంటున్నారు. సాధారణంగా అయితే, పొదుపు ఖాతా తీసుకుంటారు. వ్యాపార అవసరాల కోసం అయితే కరెంట్ అకౌంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది పొదుపు ఖాతా అయినా, కరెంట్ ఖాతా అయినా అందులో తమ డబ్బులు జమ చేసి అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే మీ అకౌంట్‌లోని డబ్బులనును ఎప్పుడైనా తీసుకోవచ్చని ఇష్టమచ్చినన్ని సార్లు తీయడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు తరుచూ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడం, తీయడం చేస్తుంటే మాత్రం ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.
మీ ఖాతాలోని డబ్బును తీసుకున్నా కొన్ని సార్లు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బ్యాంకులో డబ్బులు వేసినా, తీసినా దానికి ఓ లిమిట్ అనేది ఉంటుంది. మీరు టాక్స్ పడకుండా ఉండాలంటే సంవత్సరానికి ఎంత విత్ డ్రా చేయవచ్చో కచ్చితంగా తెలుసుకోవాలి. పరిమితికి మించి విత్ డ్రా చేసినట్లయితే ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా ఇది ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంకుకు వెళ్లి ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకున్నా ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంక్ ఖాతా నుంచి ఎంత నగదు విత్ డ్రా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194ఎన్ ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో తన పొదుపు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఆపైన విత్ డ్రా చేసినట్లయితే టీడీఎస్ కట్ అవుతుంది. వరుసగా 3 ఏళ్ల పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వారికి ఇది వర్తిస్తుంది. ఇలాంటి వారు కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసు నుంచి ఏడాదిలో రూ.20 లక్షలకు మించి విత్ డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఐటీఆర్ దాఖలు చేసే వారికి ఉపశమనం లభిస్తుంది. వారు టీడీఎస్ చెల్లించకుండానే బ్యాంకు, పోస్టాఫీసు, సహకార బ్యాంకుల నుంచి రూ.1 కోటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో విత్ డ్రా చేసుకోవచ్చు. వారికి ఎలాంటి ట్యాక్స్ పడదు. ఈ లిమిట్ దాటితే మాత్రం ఐటీ శాఖ పరిధిలోకి వస్తారు.
ఇన్‌కమ్ టాక్స్ చట్టం 1961 ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయల కంటే ఎక్కువ నగదు తీస్తే 2 శాతం టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది. గడిచిన మూడేళ్లలో ఒక్కసారి కూడా ఐటీఆర్ ఫైల్ చేయని వారు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలకు మిచి నగదు ఉపసంహరించుకుంటే ఆ మొత్తంపై 2 శాతం టీడీఎస్ కట్టాలి. వారు రూ.1 కోటి కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే 5 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అయితే ఇలా ఎక్కువ మొత్తంలో నగదు జమ చేసినా, తీసినా అది ఆదాయపు పన్ను పరిశీలనలోకి వస్తుంది. మీ ఐటీఆర్‌లో తేడాలు గమనిస్తే మీకు నోటీసులు పంపవచ్చు. ఈ విషయం సైతం గుర్తుంచుకోవాలి.