ఈ రోజుల్లో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో కొలెస్ట్రాల్ సమస్య ఒకటి. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. అయితే.. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే శరీరానికి ముప్పు పొంచి ఉంటుంది.
కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్, రెండు మంచి కొలెస్ట్రాల్. మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు, ఆహారాలు బాగా పనిచేస్తాయి. అందులో ఖర్జూర విత్తనాలు ఒకటి. ఖర్జూర విత్తనాల్ని కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎలా వాడాలో తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ప్రమాదాలు
చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యను లైట్ తీసుకుంటారు. అయితే, ఇది పెద్ద సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ మన రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఒక్కోసారి ఇది గుండె పోటుకు కారణమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఆరోగ్యానికి మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరలు కుంచించుకుపోవడం వల్ల శరీరంలో అనేక భాగాల్లో నొప్పి వస్తుంది. దీంతో.. పాదాల నొప్పులు వస్తాయి.
ఖర్జూరాలతో ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్జూరం తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎముకలను దృఢంగా మార్చడంతోపాటు కీళ్లనొప్పులు వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. వాస్తవానికి, ఖర్జూరంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ని నిరోధించడంలో సాయపడుతుంది.
ఖర్జూర విత్తనాలతో కొలెస్ట్రాల్‌కి చెక్
ఖర్జూరమే కాకుండా దీని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా. అవును, ఖర్జూర విత్తనాలను తీసుకోవడం ద్వారా మీరు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని చాలా వరకు తగ్గించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఖర్జూర విత్తనాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం?
ఖర్జూర విత్తనాలతో కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చు?
శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఖర్జూరాన్ని తినవచ్చు . ఖర్జూరంలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను బంధిస్తుంది. రక్త ప్రసరణలోకి కొలెస్ట్రాల్ అడ్డు పడకుండా చేస్తుంది. అంతే కాదు ఖర్జూరంలో ఉండే పీచు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఇక, ఖర్జూర విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో చాలా వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఖర్జూర విత్తనాల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, స్టెరాల్స్ వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. దీని కారణంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను చాలా వరకు తగ్గించవచ్చు.
ఖర్జూర విత్తనాల్ని ఎలా తీసుకోవాలి?
ఖర్జూర విత్తనాలను పొడి రూపంలో తీసుకోవచ్చు. మీరు చాలా సులభమైన మార్గాల్లో పొడిని సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా ఖర్జూర గింజలను తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విత్తనాల్ని కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన గింజలను గ్రైండర్ సహాయంతో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని స్మూతీస్, జ్యూస్, కాఫీ, టీ లేదా వేడి పాలలో కలిపి తీసుకోవాలి.