ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్మూజ్‌లో నౌకలకు భద్రత కల్పించలేం.. చెతులెత్తేసిన అమెరికా సైన్యం

international |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 07:45 PM

వ్యూహత్మాకంగా కీలకమైన హర్మూజ్ జల సంధిలో ఆయిల్ ట్యాంకర్ నౌకలకు రక్షణ కల్పించలేమని, ప్రస్తుతం అందుకు సిద్ధంగా లేమని అమెరికా సైన్యం ప్రకటించింది. తమ సైన్యాల దృష్టి కేవలం ఇరాన్‌ వ్యతిరేక ఆపరేషన్‌పైనే ఉందని ఈ మేరకు అమెరికా ఇంధన శాఖా మంత్రి క్రిస్ రైట్ గురువారం వెల్లడించారు. ఆయన సీఎన్బీసీతో మాట్లాడుతూ... ఇరాన్ దాడి సామర్థ్యాలను, వాటికి మద్దతు ఇచ్చే పరిశ్రమలను లక్ష్యంగా చేసుకోవడమే అమెరికా సైన్యానికి తక్షణ ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. ‘‘అది త్వరలోనే జరుగుతుంది, కానీ ఇప్పుడు జరగకపోవచ్చు. మేము సిద్ధంగా లేం’’ అని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య నౌకలకు భద్రత ఆపరేషన్ ఈ నెల చివరిలో మొదలయ్యే అవకాశం ఉందని క్రిస్ రైట్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్- అమెరికా దాడులతో ఇరాన్ హర్మూజ్ జల సంధిని మూసివేసిన సంగతి తెలిసిందే.


కాగా, హర్మూజ్ జల సంధిలో నౌకల రవాణాపై ఆయిల్ కంపెనీలను ప్రోత్సహిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘అవును అదే చేయాలి అనుకుంటున్నా’’ అని సమాధానం ఇచ్చారు. అలాగే, ఇరాన్ సీమైన్స్ ఉంచిందని భావిస్తున్నారా? అంటే అలా చేస్తుందని అనుకోమని అన్నారు.


ఇదిలా ఉండగా, హర్మూజ్ జల సంధి సమీపంలో సీ మైన్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో 16 ఇరానియన్ నౌకలను ధ్వంసం చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వారంలో ప్రకటించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ అటువంటి చర్యలకు పాల్పడితే తక్షణమే వాటిని తొలగించాలని హెచ్చరించారు. జల మార్గంలో మైన్స్ అమర్చి దుస్సాహాసానికి పాల్పడితే తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జల మార్గాల్లో హర్మూజ్ జల సంధి ఒకటి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం, గ్యాస్ సరఫరాలో 40 శాతం దీని ద్వారానే జరుగుతుంది.


ట్రూత్ సోషల్‌లో ‘డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లకు వ్యతిరేకంగా గతంలో మోహరించిన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి జలసంధిలో అడ్డుకోడానికి ప్రయత్నించే ఏదైనా నౌకను ‘పూర్తిగా నిర్మూలించడానికి’ అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. హర్మూజ్‌లో సీమైన్స్ అమర్చే ఇరాన్ నౌకలు, నిల్వ సౌకర్యాలపై అమెరికా దళాలు దాడి చేస్తున్నాయని పెంటగాన్ ధ్రువీకరించింది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోవడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చమురు ధరలు భారీగా పెరిగాయి.


ఈ వారం ప్రారంభంలో జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ.. వాణిజ్య నౌకలకు జలసంధిలో రక్షణ కల్పించే చర్యలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే, జలమార్గం ద్వారా సైనిక ఎస్కార్ట్‌లను కోరుతూ షిప్పింగ్ కంపెనీల నుంచి వచ్చిన అభ్యర్థనలను అమెరికా నావికాదళం ఇప్పటివరకు తిరస్కరించిందని విశ్వసనీయ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa