రాత్రి వేళ చుట్టూ చిమ్మ చీకట్లు.. నడి సంద్రంలో ఓ నౌక.. ఒక్కసారిగా భారీ అగ్నిగోళం.. కారు చీకటిలో మెరుపు మెరిసినట్టు సముద్రంపై పసుపు వర్ణంలో మంటలు జ్వలించాయి. ఈ దృశ్యం చూస్తే హాలీవుడ్ సినిమా సన్నివేశం అనుకుంటే పొరపాటే. ఇది హర్మూజ్ జల సంధిలో ఇరాన్ దాడి తర్వాత మంటల్లో చిక్కుకున్న అమెరికా యాజమాన్యంలోని ఆయిల్ ట్యాంకర్ నౌక సేప్‌సీ విష్ణు దృశ్యం. దాడి తర్వాత రెస్క్యూ కోసం వెళ్లిన నౌకలోని సిబ్బంది దీనిని రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. అండర్‌వాటర్ డ్రోన్‌తో ఇరాన్ దళాలు నౌకపై దాడిచేశాయి. దాడి అనంతరం చమురు తెట్టు సముద్ర ఉపరితలాన్ని కమ్మేసి, ఎండుగడ్డి మాదిరిగా తగలబడిపోయింది. ఈ దృశ్యాలు ఇరాన్-అమెరికా యుద్ధంలో అత్యంత భయంకరమైన ఫోటోలుగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది.
ఈ దాడిలో భారతీయ నావికుడు ఒకరు మృతి చెందగా... మరో 15 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. హర్మూజ్ జల సంధిలో ఇరాన్‌కు సమీపంలోని బస్రా వద్ద భారతీయ నావికులున్న అమెరికా నౌకపై దాడి జరిగింది. పర్షియన్ గల్ఫ్‌లో రెండు నౌకలపై అండర్‌వాటర్ డ్రోన్‌తో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడి చేసినట్టు ఆ దేశ అధికారిక టెలివిజన్ ఐఆర్ఐబీ ప్రకటించింది.
మార్షల్ ఐల్యాండ్స్ జెండా ఉన్న సేఫ్‌సీ విష్ణు ఆయిల్ ట్యాంకర్ అమెరికాకు చెందిన సంస్థ యాజమాన్యంలో ఉంది. విష్ణుతో పాటు గ్రీస్ యాజమాన్యంలోని మాల్టేసే జెండా ఉన్న జెఫైరోస్‌పై కూడా దాడి జరిగింది. దాడిలో భారతీయుడు మృతి చెందినట్టు బాగ్దాద్‌లో భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. మిగతా క్రూ సిబ్బందిని రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పేర్కొంది. ‘ఇరాక్ అధికారులతో బాగ్దాద్‌లోని భారత ఎంబసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది.. భారతీయ నావికులను రక్షించాం.. వారికి అవసరమైన సహాయం అందిస్తున్నాం’ అని ఎక్స్‌లో భారతీయ మిషన్ పోస్ట్ చేసింది. మృతిచెందిన నావికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
తమ అనుమతి లేకుండా హర్మూజ్ జల సంధిని దాటేందుకు నౌకలు ప్రయత్నిస్తే.. పేల్చేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు హర్మూజ్ నుంచే రవాణా అవుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంతో ఈ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపి, చమురు సంక్షోభానికి దారితీసింది. హర్మూజ్‌లో నౌకలను సురక్షితంగా ప్రయాణించేందుకు తమ దళాలతో భద్రత కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ, ఇది ఏ మేరకు ఫలిస్తుందో అనేది సందేహమే. ప్రస్తుతం చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రెండు వారాల్లోనే క్రూడాయిల్ బ్యారెల్ 40 శాతం మేర పెరిగింది. యుద్దం ఇప్పట్లో ఆగుతుందనే సూచనలు కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa