ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జల జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలను ఆమోదo

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 07:41 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జల జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, కడప స్టీల్ ప్లాంట్‌కు భూ కేటాయింపులు, గిరిజన రైతులకు సబ్సిడీలు, మహిళల కోసం హాస్టళ్లు వంటి అనేక ముఖ్యమైన ప్రతిపాదనలను ఆమోదించారు. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని పలు గ్రామాల్లో 424.45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.21.30 కోట్ల చెల్లింపుపై ఈ భూమిని ఏపీఐఐసీకి బదలాయించనున్నారు. రెండేళ్లలో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు కిమ్స్ ఆసుపత్రికి 2 ఎకరాలు, సంబంధిత ట్రస్టుకు 23 ఎకరాలు, తుళ్లూరు ఎడ్యుకేషన్ సొసైటీకి 3 ఎకరాలు పరిహారంగా కేటాయించారు. బాపట్ల జిల్లాలో లగ్జరీ రిసార్టుల కోసం ఏపీ టూరిజం అథారిటీకి 17 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి 20 ఎకరాలు, నెల్లూరులో ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి ఎకరం భూమిని కేటాయించారు. ముత్తుకూరులో సింగపూర్ కంపెనీ సీఎస్ఆర్ నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న ఆసుపత్రి కోసం 86 సెంట్ల భూమిని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు నిర్ణయించారు.దాత్రి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్‌లో భాగంగా 8 గిరిజన జిల్లాల్లోని అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' పథకం కింద డ్రిప్ ఇరిగేషన్‌పై 100 శాతం, స్ప్రింక్లర్లపై 90 శాతం సబ్సిడీని శాచురేషన్ పద్ధతిలో అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొండ ప్రాంతాల్లో సాగు చేసే గిరిజనులకు నీటి వనరుల సమస్యను అధిగమించి, అధిక దిగుబడులు సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను 54 శాతానికి పెంచుకోవడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి వివరించారు.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'నీటి కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024'ను రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం, చిన్న చిన్న ఉల్లంఘనలకు విధించే జైలు శిక్షలను తొలగించి, వాటి స్థానంలో జరిమానాలు మాత్రమే విధిస్తారు. ఈ చట్టాన్ని ఆమోదించడం ద్వారా రాష్ట్రంలోని కాలుష్య నగరాలకు 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం' కింద కేంద్రం నుంచి నిధులు పొందేందుకు, పరిశ్రమలపై ఫీజుల భారం తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది.మిషన్ శక్తి పథకం కింద రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే మహిళల కోసం 'సఖీ నివాస్' పేరుతో 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సురక్షితమైన వసతితో పాటు, చిన్న పిల్లలున్న తల్లుల సౌకర్యార్థం ఈ హాస్టళ్లలో క్రెష్  సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. ఉద్యోగినులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో హాస్టల్ నిర్వహణకు 8 మంది సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారు.జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు, వ్యాపారులకు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని అప్పీళ్లను విజయవాడలోనే విచారిస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో మూడు అప్పిలేట్ ట్రైబ్యునల్ కార్యాలయాలను నోటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల కేసులు త్వరగా పరిష్కారమై రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా సకాలంలో అందుతుంది.ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల జీవన్ మిషన్  పథకం గడువు ముగిసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం దానిని 2028 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో, వివిధ పథకాల కింద నిధులు సమకూర్చుకుని రూ.9,355 కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టులకు మంత్రివర్గం పరిపాలన ఆమోదం తెలిపింది. అలాగే, తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 3000 నివాస ప్రాంతాలకు రూ.1,814.71 కోట్లతో తాగునీటి పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 76 మండలాల్లోని 65 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఊతమిస్తూ మూడు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురంలో 5 ఎకరాలు, ఏలూరు జిల్లా నూజివీడులో 7 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పురుషోత్తపురంలో 5 ఎకరాల చొప్పున భూమిని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు కేటాయించారు. బదిలీలపై వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం దీని ముఖ్య ఉద్దేశం.రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్ట్ గడువు జూన్ 2027 వరకు ఉన్నప్పటికీ, పనులను త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో మూడో గ్యాంట్రీ క్రేన్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ప్రాజెక్టులో లైనింగ్ పనులతో పాటు, సుదీర్ఘకాలం పనులు నిలిచిపోవడం వల్ల దెబ్బతిన్న రాతి పొరల వద్ద భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఈ అదనపు పనుల కోసం ప్యాకేజీ-63ఏ కు రూ.23.47 కోట్లు, ప్యాకేజీ-64ఏ కు రూ.24.51 కోట్ల అదనపు వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa