ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అమరావతిలో చేపడుతున్న బిట్స్‌పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణ ప్రణాళికలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన బిట్స్‌పిలానీ ప్రతినిధులు.. బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్‌లను చూపించారు. డిజైన్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి కోర్సులు అమరావతి బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఉంటాయని బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌కు వివరించారు.
అమరావతి క్యాంపస్ ద్వారా రెండు దశలలో ఏడువేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి బిట్స్‌పిలానీ క్యాంపస్ మీద రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నామని.. ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు నారా లోకేష్‌కు వివరించారు. గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను క్యాంపస్ నిర్మాణంలో అనుసరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిట్స్‌పిలానీ క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఉంటుందని వెల్లడించారు.
అగ్రికల్చర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు అమరావతి బిట్స్ క్యాంపస్‌లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌కు బిట్స్ పిలానీ ప్రతినిధులు వివరించారు. నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.
మరోవైపు అమరావతిలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని నేలపాడులో 50 సెంట్ల స్థలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణానికి శుక్రవారం రోజు ఉదయం ఫైర్ సర్వీసెస్ డీ.జీ. పీ.వీ.రమణ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రూ.1.28 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అమరావతిలో అగ్నిమాపక కేంద్రం నిర్మించనుంది. నేలపాడులో ఏర్పాటు కానున్న ఈ అగ్నిమాపక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa