భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో తీసుకోవాల్సిన సంస్కరణలో గతంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సోమవారం మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలోనే సంస్కరణలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. సమీక్షా సమావేశం తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ వివరాలను వెల్లడించారు.
నూతన సంస్కరణల ప్రకారం 15 మీటర్ల ఎత్తు వరకూ ఉన్న భవన నిర్మాణాల ప్లాన్లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదని మంత్రి నారాయణ తెలిపారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవన నిర్మాణాలకు సంబంధించి సదరు లైసెన్స్డ్ సర్వేయర్లు.. ప్లాన్లను ఆన్లైన్లో సమర్పించి, రుసుం చెల్లిస్తే సరిపోతుందని.. అంతటితో అనుమతి వచ్చినట్టేనని మంత్రి నారాయణ తెలిపారు. అయితే ఆన్లైన్లో సమర్పించిన ప్లాన్ ప్రకారం కాకుండా నిర్మాణ సమయంలో మళ్లీ ఏవైనా అవకతవకలు జరిగితే సదరు సర్వేయర్ లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనితో పాటుగా ఆ సర్వేయర్ మీద క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. దీనివల్ల 95 శాతం మంది మున్సిపల్ ఆఫీస్‌ల చుట్టూ తిరిగే అవసరం ఉండదని మంత్రి వివరించారు.
మరోవైపు లేఅవుట్లలో ప్లాన్ అప్రూవల్ కోసం గతంలో మాదిరిగా నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం తెస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అన్ని విభాగాల సర్వేయర్లను సమన్వయం చేసి మున్సిపల్ శాఖ ద్వారా అనుమతులు ఇస్తామన్న నారాయణ.. ఒకే పోర్టల్ ద్వారా ఫీజు చెల్లించి అనుమతులు పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు 31 నుంచి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
ఇక నుంచి 500 చదరపు అడుగులు దాటిన భవనాలకూ సెల్లార్ పార్కింగ్‌కు పర్మి్షన్ ఉంటుందన్న నారాయణ.. భవనాల సెట్ బ్యాక్ పరిమితిపైనా కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 120 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల సెట్ బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు కుదించారు. అలాగే పదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తైన భవనాలలో రీక్రియేషన్ కోసం ఒక అంతస్తు ఉండాలని స్పష్టం చేశారు. లేఆవుట్లలోనూ ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదలాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
మరోవైపు ఈ సమావేశంలోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మంత్రి నారాయణ. ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల టెండర్లు నార్మన్ పోస్టర్స్ సంస్థకు వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అమరావతి నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం దశలవారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించినట్లు మంత్రి చెప్పారు.