టికెట్ లేని ప్రయాణం నేరం. ఇది అన్ని ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో కనిపిస్తుంటుంది. టికెట్ లేని వారిని గుర్తించేందుకు బస్సులకు చెకింగ్ అధికారులు.. రైళ్లకు టీటీఈలు ఉంటారు. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే.. వారికి భారీగా ఫైన్లు విధిస్తూ ఉంటారు. మనకు ఇదంతా తెలిసిన విషయమే. కానీ ఒక్క రూపాయి కట్టకుండా, టికెట్ కొనుగోలు చేయకుండా ప్రయాణించే రైలు మన దేశంలోనే ఉందని చెప్తే ఎవరైనా నమ్ముతారా. అయితే ఇదేదో వారం రోజులో, నెల రోజులో ఏదో ప్రమోషన్ల కోసం చేసింది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రయాణికులకు ఈ రైలు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. అదే భాక్రా నంగల్ రైలు.
పంజాబ్-హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నడిచే ఈ భాక్రా నంగల్ రైలు.. నిత్యం వందల మందికి ఉచిత రైలు ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ రైలులో ప్రయాణిస్తే మనం గమ్యస్థానం చేరడమే కాకుండా.. కొండలు, ప్రకృతి అందాలను ఉచితంగా వీక్షించవచ్చు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని భాక్రా, నంగల్ మధ్య ఈ రైలు ప్రతీ రోజు నడుస్తూ ఉంటుంది. పంజాబ్‌లోని నంగల్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా డ్యామ్ వరకు ఈ భాక్రా-నంగల్ రైలు ప్రయాణిస్తుంటుంది. 13 కిలోమీటర్ల పాటు ప్రయాణించే ఈ భాక్రా నంగల్ రైలు సట్లేజ్ నదిని దాటుకుంటూ శివాలిక్ కొండలను దాటుకుంటూ వెళ్తుంది. 3 టన్నెల్స్, 6 స్టేషన్లు ఈ మార్గంలో ఉంటాయి. స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ఈ రైలు ప్రయాణం ఎంతో అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది.
అయితే ఈ రైలును భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉండదు. భాక్రా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డ్ నేతృత్వంలో ఈ రైలు నడుస్తూ ఉంటుంది. భాక్రా నంగల్ డ్యామ్‌కు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు ప్రయాణించడానికి ఈ రైలును ఉపయోగిస్తారు. సాధారణ ప్రజలు, పర్యాటకులు కూడా ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ క్రమంలోనే దేశంలోని నలుమూలల నుంచి ఈ భాక్రా నంగల్ రైలు ఎక్కి.. ఆ మార్గంలోని అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు.
1948లో ఈ భాక్రా నంగల్ రైలును ప్రారంభించారు. అప్పట్లో రోడ్డుమార్గం లేకపోవడంతో ఆ మార్గంలో రైల్వే లైన్ వేశారు. ఈ భాక్రా నంగల్ రైలును పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో తయారు చేశారు. మొదట్లో ఈ మార్గంలో ఆవిరి ఇంజిన్‌తో రైలు నడిచేది. ఆ తర్వాత 1953లో అమెరికా నుంచి ఇంజిన్‌ను దిగుమతి చేసుకుని.. ఇప్పటికీ దాన్నే ఉపయోగిస్తున్నారు. ఈ భాక్రా నంగల్ రైలు.. గంటకు 18 నుంచి 20 గ్యాలన్ల ఇంధనాన్ని ఉపయోగించుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.