కార్తీక మాసం కావటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదివారం ఏకంగా ఐదు కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులు తీరాయి. ముఖద్వారం వద్ద నుంచి శ్రీశైలం చేరుకోవటానికి ఏకంగా రెండు గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో భక్తులు అసహనానికి గురౌతున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తే ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తోందంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. శ్రీశైలం ఘాట్‌రోడ్, ఆలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రద్దీని చక్కదిద్దాలని, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలని.. ఇందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే పొరుగు రాష్ట్ర అధికారులతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం నాటి పరిణామాల నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించినట్లు తెలిసింది.
శ్రీశైలంలో కేదారగౌరీ వ్రతాలు
మరోవైపు శ్రీశైలంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా కేదారగౌరీ వ్రతాలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో రెండు విడతలుగా సామూహిక గౌరీ వ్రతాలను నిర్వహించారు. సామూహిక గౌరీవ్రతాలకు చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో నంద్యాల జిల్లాతో పాటుగా పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా చెంచులు సామూహిక గౌరీవ్రతాలకు హాజరయ్యారు. వ్రతానికి కావాల్సిన సామాగ్రిని శ్రీశైలం దేవస్థానం అధికారులే సమకూర్చారు.
మరోవైపు సామూహిక గౌరీ వ్రతాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా చెంచులను ఎంపిక చేసే బాధ్యతను స్థానిక గిరిజనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. వ్రతాలు పూర్తైన తర్వాత తీర్థ ఆలయ అధికారులు భక్తులకు ప్రసాదాలు, పూజలు, గాజులు, కంకణాలను అందజేశారు. అలాగే భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనం కల్పించారు. అన్నపూర్ణ భవనంలో భోజన వసతి కల్పించారు.